గూగుల్ న్యూస్‌లో మాతో చేరండిSamayam Telugu

ఏపీలో మరోసారి కరోనా కలకలం.. ఆ జిల్లాలో ఐదు కేసులు నమోదు, ఇద్దరు మృతి.. ఏం జరిగిందంటే!

Authored byతిరుమల బాబు|Samayam Telugu
Subscribe

Two Died Of Covid 19 In Kadapa District Andhra Pradesh: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది.. ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చనిపోయిన ఇద్దరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ట్లు అధికారులు చెబుతున్నారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన 52ఏళ్ల వ్యక్తి , మాసాపేటకు చెందిన 43ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఈ కరోనా కేసులపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

హైలైట్:

  • ఏపీలో మరోసారి కరోనా కేసుల కలకలం
  • ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
  • ఇద్దరు చనిపోవడంతో అధికారుల అలర్ట్
Andhra Pradesh Covid Cases
(ఫోటోలు- Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కలకలం రేపిందా?.. కడప జిల్లాలో ఇద్దరు చనిపోయారా?.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారా?. ఇలా రెండు రోజులుగా కరోనా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. కడప జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయని.. ఇప్పటివరకు ఐదు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. వీరిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఇద్దరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారంటున్నారు. ఈ కరోనా కేసులపై ప్రభుత్వానికి ఇంత వరకు సమాచారం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.


ఏపీలో మళ్లీ కోవిడ్ కలకలం, ప్రభుత్వానికి ఇంత వరకు సమాచారం లేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. దురదృష్టకర సంఘటనలను కూడా తప్పుడు ప్రచారానికి వాడుకోవడం.. ప్రజా భద్రతకు భంగం కలిగించాలని చూడటం చట్టరీత్యా నేరం అవుతుందన్నారు. కడప జిల్లాలో బయటపడిన ఈ సంఘటనలపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించిందన్నారు. సీనియర్ డాక్టర్లు, ఆరోగ్య రంగ నిపుణులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలికంగా మద్యపానం తదితర కారణాలతో ఇటీవల సంభవించిన మరణాలపై ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కడప, సూక్ష్మజీవ శాస్త్ర విభాగం వైరల్ పరిశోధన, నిర్ధారణ ప్రయోగశాల ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని.. తదుపరి చర్యలను ప్రభుత్వం పటిష్టంగా తీసుకుంటున్నదన్నారు.

ఎన్. సుబ్బరాయుడు (52) మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. తీవ్ర స్థితిలో ఉండగా 2026 జూన్ 28న మరణించారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. వీరారెడ్డి (66) మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయని.. తీవ్ర స్థితిలో చికిత్స అనంతరం కోలుకుని 2026 జులై 4న తిరుపతికి డిశ్చార్జ్ అయ్యారన్నారు. జి కొండయ్య (67) మధుమేహం, క్షయవ్యాధితో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన చరిత్ర ఉందన్నారు. ఆయన ప్రస్తుతం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. సయ్యద్ మబాషా (43) దీర్ఘకాలిక మద్యపాన అలవాటు ఉందని.. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2026 జులై 7న మరణించారన్నారు. అక్షత్ (25) ఇతర అనారోగ్య సమస్యలు లేవని.. స్వల్ప లక్షణాలతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు.

నమోదైన అన్ని కేసులపై సమగ్ర విచారణ చేపట్టగా, ఎవరికి కూడా ఇటీవల ట్రావెల్ హిస్టరీ లేనట్లు తేలిందన్నారు. దీంతో జిల్లాలో స్థానిక స్థాయిలో వైరస్ వ్యాప్తి జరిగి ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారన్నారు. నమోదైన కేసుల్లో ఒకరు ప్రభుత్వ వైద్య కళాశాల కడపలో విధులు నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్ వైద్య విద్యార్థి కాగా.. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని,
ప్రస్తుతం ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వైరస్‌లో కొత్త రూపాంతరాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు పలు చర్యలు ప్రారంభించారన్నారు. తీవ్రత, మరణాల నేపథ్యంలో సంబంధిత నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పూర్తి జన్యు విశ్లేషణ కోసం పంపించాలని నిర్ణయించారంటున్నారు. వైరస్‌లో కొత్త లేదా ఆందోళనకరమైన వేరియంట్లు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు తెలిపారు.

రోగులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించి విస్తృత స్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని.. సంస్థాగత ఐసోలేషన్, ఇంటి వద్ద ఐసోలేషన్ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా, అధిక ప్రవాహ ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారన్నారు. తీవ్ర కేసులపై ప్రత్యేక వైద్య సమీక్ష కూడా ప్రారంభించారన్నారు.

పల్మనాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇంటర్న్‌కు కోవిడ్ నిర్ధారణ కావడంతో వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం తప్పనిసరి చేయాలని.. ఆసుపత్రి పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలని, అధిక ప్రమాదంలో ఉన్న సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నారన్నారు. అలాగే ఇన్‌ఫ్లుయెంజా తరహా లక్షణాలు లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేయడం.. ప్రభుత్వాన్ని నిందించడం సదరు సోషల్ మీడియా హ్యాండిల్స్ కు సబబు కాదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.
తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు. తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

సంభాషణను ప్రారంభించండి
telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.