బిజినెస్ ఫోరమ్‌లో పరిచయం
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. లీ పింగ్ 1996 నుంచి 2014 మధ్య తాను స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా 70 మిలియన్ యువాన్లు (సుమారు 10 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ సంపాదించారు. అతడు 2014లో ఓ బిజినెస్ ఫోరమ్‌కు హాజరుకాగా.. అక్కడ ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జాంగ్ షుదాన్ అనే మహిళ పరిచయమైంది. వారిద్దరూ చైనా వాయువ్య ప్రావిన్సు షాన్సీలోని హన్‌జోంగ్ నగరానికి చెందినవారే కావడం గమనార్హం. తాను ఒక అనాథనని, తల్లిదండ్రులు వదిలేయడంతో నిరుపేద వృద్ధ దంపతులు చేరదీశారని జాంగ్ చెప్పుకుంది.ఎన్నో కష్టాలుపడి చదువుకుని, చివరకు బ్యాంకులో ఉద్యోగం సంపాదించానని ఆమె చెప్పింది. తనను కలవడానికి ముందే తన ఆర్థిక నేపథ్యం గురించి ఆరా తీసి, పక్కా ప్లాన్‌తోనే పరిచయం చేసుకుందని లీ తరువాత గ్రహించారు. జాంగ్ పనిచేస్తున్న బ్యాంకులో 20 మిలియన్ యువాన్లు డిపాజిట్ చేసిన లీ.. తన పెంపుడు తల్లిదండ్రులకు వైద్య చికిత్సకు అవసరమని చెప్పడంతో పలుసార్లు ఆర్థిక సహాయం చేశాడు.
పెళ్లైన మర్నాడే హత్యాయత్నం
ఈ క్రమంలో 2015 ఆరంభంలో నువ్వంటే నాకు ఇష్టమని, పెళ్లి చేసుకుని, నీతో పిల్లలను కనాలని ఉందని మనసులో మాటను లీకి చెప్పింది. అతడి ఎనిమిదేళ్ల కుమార్తెను కూడా ప్రేమగా చూసుకుంటానని చెప్పడంతో లీ ఆమెకు దగ్గరయ్యాడు. అదే ఏడాది మార్చిలో తాను గర్భం దాల్చినట్టు అబద్దం చెప్పడంతో షెన్‌జెన్‌లో 75 లక్షల యువాన్ల (రూ. 9 కోట్లు) విలువైన అపార్ట్‌మెంట్‌ను ఏప్రిల్‌లో కొనుగోలు చేసి, దానిని జాంగ్ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆ జంట హన్‌జోంగ్‌లో వివాహం చేసుకున్నారు.పెళ్లైన మర్నాడు తన స్నేహితుడితో కలిసి లీ కారులో షెన్‌జెన్‌కు బయలుదేరగా.. జాంగ్ మాత్రం విమానంలో వెళ్లింది. ఆ ప్రయాణంలో కారు బ్రేకులు విఫలమై లీకి పెద్ద ప్రమాదం జరిగింది. కొద్ది రోజుల తర్వాత బ్యాంకులో తన పనితీరు రేటింగ్ కోసం కొంత మొత్తం అవసరమని, అకౌంట్‌లో 10 మిలియన్ యువాన్లు డిపాజిట్ చేయమని లీను కోరింది. ఆమె అడిగినంత సర్దుబాటు కాకపోవడంతో 2.74 మిలియన్ యువాన్లు డిపాజిట్ చేశాడు. ఆ వెంటనే ఆమె అదృశ్యమైంది. భార్య కనిపించడం లేదని వ్యాపారవేత్త ఫిర్యాదు చేయగా... ఆమె హంకాంగ్ మీదుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కు పారిపోయినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. లీ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ డాక్యుమెంట్లు, ఇతర ఆస్తుల పత్రాలు, నగదును తీసుకెళ్లిపోయిందని తేలింది.
మాజీ భార్యపై రూ. 8.3 కోట్ల రివార్డు
అయితే, పెళ్లైన మర్నాడు జరిగిన కారు ప్రమాదానికి ఆమె కారణమని తెలిసి లీ షాకయ్యాడు. ఆమె తన అనుచరుడితో కలిసి బ్రేకులను తొలగించినట్టు వెల్లడయ్యింది. ‘‘"ఆమె కేవలం నన్ను మోసం చేసి నా డబ్బు తీసుకుని ఉంటే వదిలేసేవాడ్ని.. కానీ నన్ను చంపి నా భార్యగా నా ఆస్తులన్నీ దక్కించుకోవాలని ఆమె పథకం వేసింది.. అందుకే నేను వదల్లేదు’’ అని లీ తన వైరల్ వీడియోలో వివరించాడు.ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని నిశ్చయించుకున్న లీ.. జాంగ్ ఆచూకీ గురించి సమాచారం ఇచ్చినవారికి 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.3 కోట్లు) రివార్డు ప్రకటించారు. అతను అమెరికా వ్యాప్తంగా ఉన్న చైనా కమ్యూనిటీలు, చర్చిలు, ప్రసవానంతర సంరక్షణ కేంద్రాలను సంప్రదించారు. చైనా, అమెరికాలోనూ లాయర్లు, ప్రయివేట్ డిటెక్టర్లను నియమించారు.
ఇందుకోసం ఆయన ఏకంగా 13 మిలియన్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 18 కోట్లు) ఖర్చయింది. లాస్ ఏంజెలెస్ పోలీసులు చివరికి జాంగ్, ఆమె బిడ్డను గుర్తించారు. ఆ తర్వాత జరిపిన డీఎన్ఏ పరీక్షలో ఆ బిడ్డ లీకి పుట్టింది కాదని తేలింది.
జాంగ్‌తో వివాహం రద్దుకాకపోవడంతో మొదట్లో కోర్టు విచారణ ఆలస్యమైందని లీ చెప్పారు. కానీ, 2020లో షెన్‌జోన్‌లోని ఓ కోర్టు వారి వివాహాన్ని రద్దు చేసి, జాంగ్ పేరు మీద ఉన్న ఆస్తులను తిరిగి లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. మోసం, అక్రమ వలస, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండటం, పిల్లల అపహరణ, మానవ అక్రమ రవాణాతో సహా 23 నేరాలల్లో జాంగ్‌ను దోషిగా నిర్దారించిన కాలిఫోర్నియా కోర్టు.. ఆమె 65 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెకు సహాయం చేసిన పలువుర్ని పోలీసులు గుర్తించారు.







